సృజన సారథి కొంపెల్ల

సృజన సారథి కొంపెల్ల

శ్రీశ్రీని చిరంజీవిగా నిలిపిన సృజన సారథి కొంపెల్ల
– జూన్ 23 కొంపెల్ల జనార్ధనరావు వర్ధంతి

మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ చదివిన ప్రతిఒక్కరికీ సుపరిచితమైన పేరు కొంపెల్ల జనార్ధనరావు. తన సుప్రసిద్ధ కవితాసంపుటి మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ ఆయనకే అంకితం ఇచ్చాడు. శ్రీశ్రీని 1928 నాటికే కాబోయే మహాకవిగా కొంపెల్ల గుర్తించారు. ‘కొంపెల్ల జనార్ధనరావుతో నాకు మొట్టమొదటిసారి 1928లో మద్రాసులోని తంబుచెట్టి వీధిలో పరిచయమయ్యింది. ఆ ఏడే కొత్తగా నేను చదువుకోసం మద్రాసులో అడుగు పెట్టాను. మా నాన్న నన్ను హాస్టల్‌లో జాయిన్‌ చేసి వెళ్ళిపోయాడు. అందరూ నాకు కొత్తే. అసలు మద్రాసు నగరమే ఒక మహాసముద్రంలా కనిపించేది. అప్పుడు నా వయస్సు పద్దెనిమిదేళ్ళు. నాకంటే జనార్ధనరావు రెండు మూడేళ్ళు పెద్ద. జనార్ధనరావు బాగా పద్యాలు రాసేవాడు. మేమిద్దరం ఎప్పుడూ వాదించుకొనేవాళ్ళం. జనార్ధనరావు తన అభిప్రాయాల్ని ఎవరిమీదా బలవంతంగా ఎప్పుడూ రుద్దేవాడు కాడు. ఇద్దరం సాహిత్య మంటే పడి చచ్చేవాళ్ళం. సాహిత్యానికే మా జీవితాలను అంకితం చెయ్యాలనుకున్నాం. ఏ ఎండకా గొడుగు పట్టడమంటే ఇద్దరికీ పరమ అసహ్యం.’ ఇవీ శ్రీశ్రీ తన మిత్రుడు కొంపెల్ల గురించి చెప్పిన మాటలు.

‘ఆఖరి రోజుల్లో ఒక మూడు రోజులు కాబోలు జనార్ధనరావు మా ఇంట మంచం పట్టాడు. ‘మీరెంత బాధపడుతున్నారో, ఆరోగ్యం వుండి కూడా నేనూ అంత బాధపడుతున్నాన’ని అతనితో అన్నాను. జనార్ధనరావుకి క్షయ వ్యాధి వచ్చింది. అతడ్ని చంపింది ఆ వ్యాధి కాదు. దారిద్య్రమే అతని ప్రాణాలు తీసింది. నేను కటిక దరిద్రం అనుభవిస్తూ వుండే రోజులవి. అతను కోరినట్లు నేను మద్రాసు చేరుకోగలిగి ఉంటే జనార్ధనరావు తప్పకుండా జీవించేవాడే. అతడి మరణం అనేక ఆలోచనలు రేపింది. ఎటు చూసినా అతడు మరణించాడనే వగపు మాత్రం మిగిలింది. అయినా అతడు చనిపోయాడంటే నమ్మలేకుండా వుండేవాడ్ని.

‘తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తం!/ సెలవంటూ ఈ లోకాన్నే వదిలి’ అంటూ ఓ అంకిత గీతం రాశాను. నా ‘మహాప్రస్థానం’ కవితా సంపుటి అతనికి అంకితమిచ్చాను.’ అని చెప్పారు శ్రీశ్రీ.

కొంపెల్ల జనార్ధనరావు జన్మించినది 1906 ఏప్రిల్‌ 15న తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర మోడేకుర్రులో. చిన్ననాటి నుంచే సాహిత్యంపై మక్కువతో రచనలు చేసాడాయన. పుట్టింది జమిందారీ కుటుంబంలోనే అయినా జనార్ధనరావుకు యుక్తవయసు వచ్చేసరికే వారి ఆస్తులు కరిగిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో సంస్కృతాభ్యాసం తర్వాత రాజమండ్రిలోని వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో అతని చదువు కొనసాగింది. గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఆ తర్వాత కాకినాడ ప్రభుత్వ కళాశాలలో చేరాడు. అప్పటికే ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో చదువుకు స్వస్తిచెప్పి ఉద్యోగాన్ని వెతుక్కుంటూ విశాఖపట్నంలోని ‘కవితా సమితి’ ద్వారా పురిపండా అప్పలస్వామి సాహచర్యంతో మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రేరణతో భారతి పత్రికలో రెండు పదుల వయస్సులోనే ఉపసంపాదకునిగా చేరాడు. ‘తాన్‌ సేన్‌’ , ‘తెలుగు’ అనే నాటికలు రాసాడు. భారతి, ఆంధ్రపత్రిక, సుభాషిణి తదితర పత్రికలలో దాదాపు 25 కవితా ఖండికలను భావ కవితారీతిలో ప్రచురించాడు. 1934 డిసెంబరులో ఉదయిని అనే ద్వైమాసిక సాహిత్య పత్రికను ప్రారంభించాడు. అయితే ఈ పత్రికను ఆయన ఆరు సంచికల కన్నా వెలువరించలేకపోయారు. సాహిత్యానికి ప్రజాభిమానం సంపాదించాలన్న గొప్ప ఆశయంతో అహర్నిశలు పనిచేసి పత్రికను కొనమని వాడవాడలా సాహితీవేత్తలను అర్ధించాడు. అప్పటి కొత్త కవులు నవ్య సాహిత్యపరిషత్‌ తరఫున స్థాపించుకున్న ప్రతిభ అనే సాహిత్య పత్రిక సాహిత్యపరుల అభిమానం చూరగొనడంతో ఉదయిని పత్రిక మరింత దెబ్బతింది. ఈ క్రమంలో ఆయన చేసిన శారీరక, మానసిక శ్రమ వల్ల అనారోగ్యం తప్పలేదు. ముద్రణ ఖర్చులు కొంపెల్ల ఇవ్వలేకపోవడంతో ముద్రాపకుడు ఉదయిని ఏడో సంచికను చిత్తు కాగితాలుగా అమ్మేశారు. ఈ అఘాతం తట్టుకోలేక, అనారోగ్యానికి గురై తీవ్రమై క్షయ వ్యాధితో దుర్భరపరిస్థితికి లోనయ్యాడు.

సమున్నత సాహితీ వ్యక్తిత్వం
1928లో శ్రీశ్రీ రాసిన ‘ప్రభవ’ను కొంపెల్ల సమీక్షిస్తూ తీవ్ర విమర్శలు చేశాడు. శ్రీశ్రీ కవిత్వంలో సుదీర్ఘ సమాసాలు ఎక్కువయ్యాయని, సంస్కృతంపాళ్లు ఎక్కువైందని, అనుకరణ వద్దని’ తన విమర్శల్లో స్పష్టం చేసాడు. అప్పటికి శ్రీశ్రీ ఇంకా కృష్ణశాస్త్రి, విశ్వనాధల ప్రభావంలోనే ఉన్నాడు. సొంతగొంతుక కావాలన్న స్పృహని శ్రీశ్రీలో రగిలించింది కొంపెల్ల విమర్శలే. ఆ కారణంగానే వీరిద్దరు మంచి మిత్రులయ్యారు. శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అని విప్లవాత్మకంగా రాసిన ‘జయభేరి’ గేయాన్ని భారతి పత్రిక తిరస్కరిస్తే తన ‘ఉదయిని’ పత్రికలో ప్రచురించి శ్రీశ్రీ సాహితీ మహాప్రస్థానానికి అండగా నిలిచాడు కొంపెల్ల. అభ్యుదయ సాహిత్యంపై అత్యంత అభిమానంతో సాహితీ సృజనచేసి, సాహిత్య పత్రికను నిర్వహించిన కొంపెల్ల జనార్ధనరావు మూడు పదులు దాటిన వయస్సులో 1937 జూన్ 23న మృతి చెందాడు. మరో ప్రపంచపు కవి శ్రీశ్రీ ఎలాగైతే తెలుగు సాహిత్యపు వెలుగై ఉంటాడో- కొంపెల్ల జనార్దనరావు కూడా అలాగే చిరంజీవిగా ఉంటాడు.