"సుందరదాసు" ఎమ్మెస్

హనుమాన్ లీలా సంపదని తెలుగువారికందించిన ఎమ్మెస్ రామారావు

తెలుగువారికి ఎంతో ఆర్తితో ప్రేమతో భక్తితో అలవోకగా ఆశువుగా హనుమంతుడి లీలాగానం వినిపించిన ధన్యజీవి ఎం.ఎస్ రామారావు. సుందరకాండను పండిత పామర జనరంజకమైన గీతంగా అలతి పదాల్లో రాసి తానే బాణీ కట్టి ఆలపించిన చిరస్మరణీయ గాయకుడు ఎమ్. ఎస్. రామారావుగా ప్రసిద్ది పొందిన మోపర్తి సీతారామారావు.

1940 నుంచి కొన్ని దశాబ్దాల పాటు సినీ నేపథ్యగానమే గాక లలితసంగీతం లోనూ కృషి చేసి విలక్షణ గాయకుడిగానూ, గేయరచయితగానూ తెలుగు సంగీత సాహిత్య ప్రపంచాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్న ఎమ్. ఎస్. రామారావు జులై 3, 1921 సంవత్సరం తెనాలి సమీపములోని మోపర్రు గ్రామములో జన్మించారు. తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య, సీతమ్మ రామభక్తులు. రామారావు హైస్కూల్ విద్యాభ్యాసం నిడుబ్రోలు లోను, ఉన్నత విద్య గుంటూరు హిందూ కళాశాల లోనూ సాగింది. 1942లో వీరి వివాహం లక్ష్మీసామ్రాజ్యంతో జరిగింది. వీరికి వీరికి ఒక కుమార్తె (వెంకట సరోజిని), ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు) ఉన్నారు

సినీరంగంలో
ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో (1941 లో) అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన అడవి బాపిరాజు చలన చిత్ర రంగంలో ప్రవేశించమని ఆయనను చాలా ప్రోత్సహించారు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సి.హెచ్. నారాయణరావుకు ఇది గాత్రదానం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. తరువాత ఈయన దీక్ష, ద్రోహి, మొదటిరాత్రి, పాండురంగ మహత్యం, నా యిల్లు, సీతారామ కల్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు.

మూడింటి లోనూ విశేషమైన ప్రతిభ
ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టుండే గేయరచన, సంగీతం, గానం – ఈ మూడింటి లోనూ విశేషమైన ప్రతిభ చూపారు రామారావు. రాజకీయంగా, సాంఘికంగా సమాజం పెనుమార్పులకు గురి అవుతున్న ఆ కాలంలో సంగీత సాహిత్యాలలో కూడా కొత్త మార్పులు, కొత్త పోకడలు మొదలయ్యాయి. దీనితో నూతన గాయకులకు తమ గొంతు వినిపించే అవకాశం దొరికింది. రామారావు కూడా అదే బాటన శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా, తన సహజసిద్ధమైన ప్రతిభతో గుంటూరులో గొంతు వినిపించగలిగారు. ఆ తరువాత సినీనేపథ్యగాన రంగప్రవేశంతో ఆయన జీవితంలో మొదటి దశ ప్రారంభం అయ్యింది.

1944 లో వై. వి. రావు తాసీల్దారు అనే సినిమాలో సి. హెచ్. నారాయణరావుకి ప్లేబాక్ పాడించడంతో మొదలయ్యింది రామారావు సినీ నేపథ్యగాన ప్రస్థానం. ‘ఈ రేయి నన్నొల్లనేరవా’ అనే నండూరి సుబ్బారావు ఎంకి పాటను ఈ సినిమా కోసం పాడారు. దీనిని నేర్చుకోవడం కోసమే కొద్ది రోజులు సుబ్బారావుగారి ఇంట్లో ఉన్నారు కూడా. ఆ మొదటి పాటే పెద్ద హిట్ అయ్యింది. ఆ రోజుల్లో పాటలు ఎక్కువగా మంద్రస్థాయిలోనూ, మధ్య స్థాయిలోనూ వుండేవి. తీవ్రమైన కోపం, బాధ చూపాలన్నపుడు మాత్రమే పాట తారాస్థాయికి చేరేది. ఈ రెండు స్థాయిలలోనూ రామారావు గొంతు మెత్తగా, పైరు మీద గాలిలా హాయిగా సాగిపోతుంది. అదే సినిమాలో కమలా కొట్నీస్‌తో కలిసి ‘ప్రేమలీల మోహనా’ అనే బలిజేపల్లి లక్ష్మీకాంతకవి పాటను డ్యూయెట్‌గా పాడారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి. రెండో పాటలో రామారావు గొంతు సైగల్ గొంతులా వినపడుతుంది. ఆ రోజుల్లో యువగాయకులు, సంగీత దర్శకులు సైగల్‌ని అనుకరించడం పరిపాటే. ఈ రెండుగీతాలూ రామారావు కోమలస్వరంతో శ్రోతల మనస్సులో చెరగని ముద్రవేస్తాయి.

దీక్ష, ద్రోహి, మొదటి రాత్రి, పాండురంగ మహత్యం, రాజనందిని, కృష్ణ లీలలు, మానవతి, జయసింహ వంటి అనేక సినిమాలకు రామారావు నేపథ్యగానం అందించారు. వినాయక చవితి సినిమాలో సముద్రాలగారి ‘యశోదా కిశోర’; కార్తవరాయుని కథ సినిమాలో ‘మరొక్క క్షణం మిగిలింది’; రాజనందిని సినిమాలో భక్తి, ఆర్తి రెండూ కలసిన మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి ‘హర హర పుర హర శంభో’; చివరకు మిగిలేది సినిమాలో మల్లాదివారి ‘చెంగున అల మీద ఎగసి పోతదే మేను’. ఇలా, ఆనాటి మహాకవులెందరో రాసిన పాటలు వీరి గొంతులో ప్రాణం పోసుకున్నాయి.

దీక్ష సినిమాలో ఆత్రేయగారు రచించిన ‘పోరా బాబు పో’ పాట ఆ రోజుల్లో అందరి నాల్కల మీదా ఆడేది. ఈ సినిమా తమిళంలో తీసినప్పుడు కూడా ఈ పాటని రామారావు చేతే పాడించారు. ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొంది, ఈనాటికీ పాత సినిమా పాటల అభిమానులను అలరించే పాట, నా ఇల్లు సినిమాలో ‘అదిగదిగో గగన సీమ’. దీనికి బాలసరస్వతిగారు మొదటి వర్షన్ పాడితే రెండో వెర్షన్ రామారావు పాడారు. పేరంటాళ్లు అనే సినిమాలో కృష్ణవేణిగారితో కలిసి పాడిన ‘ఓ రాజా, మోహన రాజా’; మానవతి సినిమాలో రావు బాలసరస్వతితో కలిసి పాడిన ‘ఓ మలయ పవనమా’- రెండూ ఆ రోజుల్లో బహుళ ప్రజాదరణ పొందాయి. పై రెండు పాటలకు రచన, సంగీతం సమకూర్చినది బాలాంత్రపు రజనీకాంతారావు.

రామారావు తెలుగు, తమిళం లోనే కాక కన్నడంలో కూడా పాడారు. ప్రముఖ సంగీత ద్వయం రాజన్–నాగేంద్ర సంగీత దర్శకత్వంలో, నాగార్జున సినిమాలో ‘శాంతి సమాధాన’ అనే పాట పాడారు. ఆయనని అభిమానించే నటులలో ఎన్. టి. రామారావు ఒకరు. వీరి స్వంత సినిమాలైన పిచ్చి పుల్లయ్య (1953) నుండి సీతారామ కళ్యాణం దాకా (1961) ప్రతి సినిమాలో ఎమ్. ఎస్. రామారావుది కనీసం ఒక పాటైనా ఉండేది. ఇది కాక 1954లో తీసిన పల్లెపడుచు సినిమాకి సంగీత దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు.
1944లో ప్రారంభమైన రామారావు సినీ జీవిత ప్రస్థానం 1964 దాకా సాగింది. ఇది మొదటి దశ. దరిమిలా సినీరంగంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త గాయకులు ప్రవేశించారు. ముఖ్యంగా ఘంటసాల తన స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాలంతో పాటు వీరి సంపాదనలో కూడా మార్పు వచ్చింది. ఇంక మద్రాసులో ఉండడం కష్టమైంది. మెల్లగా 1963 ప్రాంతంలో వీరు రాజమండ్రి చేరారు. సినీ నేపథ్య గాయకుడిగా, పాటల రచయితగా, సంగీత దర్శకుడుగా అప్పటికి ఇరవయ్యేళ్ళుగా సాగిన జీవితంలో మార్పు మొదలైంది.

1964 నుంచి 1974 దాకా ఆయన ఒక సామాన్యుడిగా రాజమండ్రిలో నవభారత గురుకులం అనే ఒక చిన్న పాఠశాలలో లైబ్రేరియన్‌గా పనిచేశారు. ఈ కాలాన్ని సంధికాలం అనవచ్చును. ఇది ఒక కళాకారుడిగా రామారావు మరుగున పడ్డ కాలం.
1971లో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది. రామారావుగారి పెద్దబ్బాయి బాబూరావు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ ఆఫీసర్. ఆయన ఆ యుధ్ధంలో పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు ఒక ప్రమాదం తరువాత ఆయన ఆచూకీ తెలియలేదు. ఈ వార్త కుటుంబానికి ఊహించని దెబ్బ. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఆ భగవంతుడే దిక్కని, రామభక్తుల కుటుంబం కనుక, హనుమంతుని చరణాలను ఆశ్రయించారు. ఆయనే తమకు ఆధారం అనుకున్నారు. వారి అబ్బాయి క్షేమంగా తిరిగివచ్చారు. ఇది రామారావు జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. వారి దృష్టి ఆధ్యాత్మికం వైపుకు మరలింది. అలా వారి జీవితంలో మూడో దశ ప్రారంభమయింది.

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
ఒక ప్రక్క సినీ సంగీత ప్రస్థానం ఇలా జరుగుతూ ఉండగా మరో ప్రక్క ప్రైవేట్ ఆల్బములు, రేడియోలో పాటలు, గేయరచన, నాటకాల రచన, నటనా వ్యాసంగాలు నడిచేవి. సినిమా పాటలు ఎంత జనాదరణ పొందాయో, వీరి ఇతర పాటలు కూడా అంతే ప్రాచుర్యం పొందాయి. రాయప్రోలుగారి భావకవితలను పాడటం వీరికి ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది. నిజానికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈనాడు రామారావుగారి పేరు తలచుకోగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన పాడిన ఇతర పాటలే. అందులో అతి ముఖ్యంగా గుర్తు ఉండే పాట: ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో. ఇది ఆయన జహాపనా అనే నాటకం కొరకు రాశారు. ఆ నాటకంలో వీరు షాజహాన్‌గా నటించారు కూడా. ఇదే పాటని తరువాత 1988లో నీరాజనం అనే సినిమాలో ఉపయోగించుకున్నారు. అలా మరుసటి తరానికి కూడా ఈ పాట తెలియవచ్చింది. ఈ పాట తరువాత హెచ్. ఎమ్. వి. రికార్డ్‌గా కూడా వచ్చింది.
ఈ పాట ఆయన బహుముఖీయమైన ప్రతిభకు అద్దం పడుతుంది. ఇందులో సాహిత్యం, సంగీతం రెండూ హృద్యంగా ఉంటాయి. శాస్త్రీయ సంగీత శిక్షణ లేకున్నా ఏ రాగం ఎక్కడ వాడాలన్నది వారికి సహజసిద్ధంగా అబ్బిన విద్య. పాడేటప్పుడు కూడా క్లిష్టమైన సంగతులైనా, స్వరాలతో సహా అవలీలగా పాడేవారు. మధ్యమావతి రాగంలో సాగుతుంది ఈ పాట. అయితే లలిత సంగీతానికి ఉన్న వెసులుబాటు వల్ల పాట అంతా ఒక రాగం ఆధారంగా ఉండాల్సిన అవసరం లేదు. పాట భావాన్ని బట్టి అన్యస్వరాలు చేర్చవచ్చు. రాగమాలికలా పాడవచ్చు. ఈ వెసులుబాటు వల్లే పాట మొదలు మధ్యమావతి రాగంలో ఉన్నా రెండో చరణంలో వేరే రాగపు ఛాయలు కనిపిస్తాయి. ఆ సాహిత్యంలో ఉన్న నిర్లిప్తత, విచారం, శాంతి స్వరం లోనూ వినపడుతుంది. మంద్రస్థాయిలో సాగే ఈ పాట జోలపాట భావన కలగచేస్తుంది. తాజ్‌మహల్ గురించి రాసిన పాటల్లో వెనువెంటనే గుర్తుకువచ్చే పాటల్లో ఇది మొదటిదైతే, రెండవది బసవరాజు అప్పారావు గారి మామిడిచెట్టుకు అల్లుకున్నది మాధవీలత ఒకటి-అన్న పాట.

సుప్రసిద్ధం చేసిన హనుమాన్ చాలీసా

ఈ భక్తి ఒరవడిలో ఆయన హనుమాన్ చాలీసాను 1972 ప్రాంతంలో తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టారు. ఆపైన 1974 కల్లా సుందరకాండ తెలుగులోకి పాటలా అనువదించడం పూర్తి అయ్యింది. ఆతరువాత వీరు హైదరాబాద్ వచ్చి ప్రముఖ పాత్రికేయులు, మిత్రులు అయిన గుడిపూడి శ్రీహరిని కలిశారు. వీరి ప్రతిభ తెలిసిన శ్రీహరి రవీంద్రభారతిలో ఒక సభను, తరువాత సికింద్రాబాద్ లోని ఒక సభలో సుందరకాండ సప్తాహంగాను ఏర్పాటు చేశారు. శ్రీహరిగారు ఒక ఇంటర్‌వ్యూలో చెప్పినదాని ప్రకారం, మొదటి రోజున సికింద్రాబాద్ సప్తాహంలో 10-15మంది వున్నారు. రెండో రోజుకు ఆ సంఖ్య 30-40 మందికి పెరిగింది. మూడవ రోజు తరలి వచ్చిన జనాలకు ప్రాంగణం నిండిపోవడంతో స్థలం చాలని వాళ్ళంతా గోడల మీద వేలాడుతూ విన్నారు. అలా ముగిసిన ఆ సప్తాహం ఒక నూతన అధ్యాయాయానికి నాంది పలికింది.

ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే రామారావు పాలగుమ్మి విశ్వనాథంగారికి తన అనువాదం, పాట వినిపించారు. విశ్వనాథం ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో లలితసంగీత విభాగంలో ప్రొడ్యూసర్‌గా వున్నారు. వారు అప్పటి స్టేషన్ డైరెక్టర్ పుల్లెల వెంకటేశ్వర్లుగారికి ఈ పాటను వినిపించడం, ఆయన వెంటనే చాలీసా, సుందరకాండ రేడియో కోసం రికార్డ్ చేయమని ఆదేశించడం జరిగినది. ఆ మొత్తం రికార్డింగ్ 20 రోజులు పాటు సాగినది. ఈ పాటల్లో కొన్నింటికి నేపథ్యసంగీతం పాలగుమ్మి విశ్వనాథం, కొన్నిటికి చిత్తరంజన్ అందించారు. ఈ నాటికీ భక్తిరంజనిలో ఈ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడే కాక తిరుపతి కొండపైన కూడా భక్తులందరూ వినగలిగేలా ప్రసారమవుతూనే ఉన్నాయి.

ఈ ప్రయోగం తరువాత రామారావుకి వరుసగా సప్తాహాలకు ఆహ్వానాలు అందేవి. ఆయన హైదరాబాదులోనే కాక అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోను, మిగతా రాష్ట్రాలలోనూ ఎన్నో సప్తాహాలను నిర్వహించారు. హెచ్. ఎమ్. వి. వారు దీనిని రికార్డుగా విడుదల చేయడంతో సుందరకాండ మరింత ప్రాచుర్యం పొందింది. అదే స్ఫూర్తితో వీరు రామాయణంలోని బాలకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ కూడా తెలుగులోకి పాట రూపంగా అనువదించారు. ఈ ప్రస్థానం మొదలవగానే వీరు రాజమండ్రి వదిలి హైదరాబాదు చేరడం, కొద్ది రోజులలోనే అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుని స్థిరపడడం వీరి జీవితం లోని మూడో దశ.

1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో రామారావుగారిని ఘనంగా సత్కరించారు. 1977లో ఆయనకు సుందరదాసు అనే బిరుదు ఇవ్వడంతో ఆయన సుందరదాసు ఎమ్. ఎస్. రామారావుగా స్థిరపడ్డారు. 2001 ప్రాంతంలో వీరి నివసించిన వీధికి, మరణానంతరం వీరి పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించింది.

హనుమాన్ చాలీసా, సుందరకాండ అనువాదాలను పాట రూపంగా మలచడంలో వీరి ప్రతిభ కనపడుతుంది. సాహిత్య దృష్టి కాక తులసీదాసు రాసిన భావం అందరికీ అర్థం అయ్యేలా రాయడమే రామారావు ఉద్దేశ్యంగా అర్థమవుతుంది. చాలీసాలోని మొదటి శ్లోకం ఆయన మార్చలేదు. ఆ తరువాత

శ్రీ హనుమానుని గురు దేవు చరణములు
ఇహ పర సాధక శరణములు
బుద్ధి హీనతను కలిగిన తనువులు
బుద్బుదమని తెలుపు సత్యములు

అంటూ సాగుతుంది. చాలీసా ఎక్కడ అవధి భాషలో ఉంటుందో అది మాత్రమే తెలుగులోకి అనువదించారు. ఆ భాష తెలియకుండా గుడ్డిగా చదివిన దాని కన్నా భక్తిగా భావం అర్థం చేసుకుని చదివితే ఫలితం ఎక్కువ వుంటుందని వారి నమ్మకం.

ఇక సుందరకాండ కావ్యంలో మొదలు ‘శ్రీ హనుమాన్ గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ’ అంటూ పల్లవిగా సాగుతుంది. ఈ పాట మొత్తము ఒక రెండు గంటల నిడివిలో వుంటుంది. హనుమంతుడు లంక దాటే ప్రయత్నములో మొదలు పెట్టి సీతాన్వేషణ ముగిసి శ్రీరాముడి దగ్గరకు తిరిగి చేరడంతో ఈ సుందరాకాండ ముగుస్తుంది.

సుందరకాండలో వీరు వినియోగించిన రాగాలు ఆయన సహజ ప్రతిభకి అద్దంపడతాయి. మొదటి చరణం మంగళకరమైన సింధు భైరవి రాగంలో మొదలవుతుంది. తరువాత ఆయన దర్బారు కానడ, శ్రీరంజని, మాండు, కల్యాణి, హిందోళం, మోహన, చక్రవాకం, భూపాలం, శ్రీరాగం, శుభపంతువరాళి, వలజీ–ఇలా ఎన్నో రాగాలు ఉపయోగించారు. ఇదీ ఆయన సంగీత సంపద. భావానికి తగినట్లుగా రాగం ఎంచుకోవడంతో, ఆ గానప్రవాహం ఒక రాగం నుండి మరో రాగానికి అతి తేలికగా మారుతూ చెవికి ఇంపుగా వినపడుతుంది. ఇక, రచనాధోరణి గమనిస్తే భావం తెలిసేలా చెప్పడం ఒకటే వారి ధ్యేయంగా కనపడుతుంది.

శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు
అతి బలవంతుడు రామ భక్తుడు
లంకకు పోయి రాగల ధీరుడు
మహిమోపేతుడు శత్రుకర్శనుడు

అంటూ, అంత్య ప్రాసలతో, తేలికైన మాటలతో నడుస్తుంది వారి పాట.

పవన తనయుని పద ఘట్టనకే
పర్వత రాజము గడగడ వణికే
ఫల పుష్పాదులు జలజల రాలే
పరిమళాలు గిరి శిఖరాలు నిండే
పగిలిన శిలల ధాతువు లెగిసే
రత్న కాంతులు నలుదెసల మెరసే

అంటూ, సహజ లయతో వాక్యం సాగుతుంది. 149 భాగాలుగా ఉన్న సుందరకాండను గీతంగా రాసే క్రమంలో సందర్భాన్ని బట్టి ఘటనలను కొన్ని రెండు చరణాలు, కొన్ని నాలుగు, కొన్ని అయిదు, కొన్ని ఎనిమిదిగా విభజించారు. ఒక్కొక్క ఘటనను విడదీసి దానికి అనుగుణమైన రాగాలు ఎన్నుకున్నారు. పద చిత్రణకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చిన కొన్ని చోట్ల అందమైన పదప్రయోగం కూడా చేశారు.

ఉదా. సురస ఘట్టంలోని ఈ పాదం:

పవనకుమారుని సాహసము గని
దీవించే సురస నిజ రూపము గొని
నిరాలంబ నీలాంబరం గనుచు
మారుతి సాగెను వేగము పెంచెను.

‘నిరాలంబ నీలాంబరం’ అలాంటి ఒక సొగసైన పదప్రయోగం.

అనిల కుమారు డా రాత్రి వేళను
సూక్ష్మ రూపుడై బయలుదేరును
రజనీకరుని వెలుగున తాను
రజనీచరుల కనుల బడకును
పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను.

లంకా సౌధాల గురించిన వర్ణన చక్కటి పదచిత్రణకు ఉదాహరణ. పదచిత్రణ అనువాదమే అయినా తెలుగులో చాలా తేలికైన మాటలతో సామాన్యుడికి సైతం అర్థం అయ్యే రీతిలో రాశారు.

సీతాదేవిని అశోకవనంలో ‘క్రుంగి కృశించి సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖ’ అని అభివర్ణించారు. ఈ వర్ణన వాల్మీకి రామాయణం లోనిది. తొట్టతొలి పాదంలో హనుమను శత్రుకర్శనుడు అనడం కూడా, వాల్మీకి రామాయణం సుందరకాండ తొలిశ్లోకం నుండి తీసుకున్నదే. వీలు కుదిరిన ప్రతిచోటా, మూలానికి దగ్గరగానే మసలుకున్న రామారావు శ్రద్ధ గమనించదగ్గది. 149వ చరణంలో ఫలశృతి చెపుతూ తనెందుకు ఈ అనువాదం చేశారో తెలియజేశారు.

నలుగురు శ్రద్ధతో ఆలకించగా
నలుగురు భక్తితో ఆలపించగా
సీతారామ హనుమానులు సాక్షిగా
సర్వజనులకు శుభములు కలుగగా
కవి కోకిల వాల్మీకి పలికిన
రామాయణమును తేటతెలుగున
శ్రీ గురుచరణాసేవాభాగ్యమున
పలికెద సీతారామ కథ…. అంటూ ముగించారు.

1992 ఏప్రిల్‌20న తన 71వ సంవత్సరాల వయస్సులో మరణించిన ఎమ్. ఎస్. రామరావు తెలుగువారికి అందించిన ఘన సంగీత సంపద చిరస్మరణీయమైనది.