గుండె గోస

‘ఓలమ్మా! టివీ లోన ఏటో అయిపోతంది’ లచ్చిగాడు అమ్మని పిలిచాడు.
అమ్మ పెరట్లో పనిలో ఉండి వినిపించుకోలేదు.

తాత గుమ్మంలో నిలబడి ఉన్నాడు. మనవడ్ని బడికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా బయట ఊత కర్ర పట్టుకొని లచ్చిగాడు ఎప్పుడు బయటికి వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. తాత దగ్గరకెళ్ళి చెయ్యి పట్టుకొని

‘తాతా! తాతా! ఒపాలిట్రా”
‘ఏటిరా! నీవు ఇస్కోలికి ఎల్లవా ఏటి? ఇంత పెందిలే టివీ ఊసు నీకెందుకురా?”
‘ఒక్కపాలిట్రా తాతా! టివి లోనా… ఏటో సూపిస్తన్నారు. అయ్య అందులో ఉన్నాడేటో!”

ఇద్దరూ టివి దగ్గరకొచ్చారు.

వార్తల్లో కాశ్మీర్ లోని పుల్వామాలో సైనుకులపై ముష్కరుల దాడి. 39 మంది జవానుల దుర్మరణం.
తాతకి పరిస్థితి అర్ధమయ్యింది.

స్వగతంలో ‘ముప్పై తొమ్మండుగురా!’ కొడుకు అందులో ఉండుంటే! ఈ ఆలోచన రావడమే తడవ…

కంటిలో నీరు ఆగటంలేదు. పెదవులు బిగబట్టి మాటలు పెగలడం లేదు. లచ్చిగాడికి ఏం చెప్పాలో తెలియడం లేదు. కోడలు ఇంటి పెరట ఏదో పనిలో మునిగి ఉంది. పిలవాలా!.. ఇప్పుడే ఎందుకు? చెబితే తన స్పందన ఎలా ఉంటుందో? అప్పుడే ఎన్నో ఆలోచనలు.

కాళ్ళ క్రింద భూమి కదిలిపోతున్నట్లుంది. కుప్ప కూలిపోయాడు పాపం.
లచ్చిగాడికి ఏమీ బోదపడలేదు. అవ్వ ఇంట్లో లేదు. అమ్మ దగ్గరకెళ్ళాడు.

‘ఏటిరా! ఇస్కోలుకి పోనావనుకుంటే ఈడే సచ్చినావా? గుంటడకనా, ఒక్కటేస్తీ’ చీపురుకట్ట పట్టుకొని లచ్చిగాడికి మందలించింది.
‘టివిలోనా …’ ఏదో చెప్పబోయాడు.
‘ఇంత పెందిల టివి నీకేలరా! ఇంత పకాలి తినేసి ఇస్కోలుకి ఎల్లకుండా! ’
‘అదికాదే అమ్మ. ఓపాలిట్రా! టివి సూసి తాత గపుక్కున కూకుండి పోనాడు’
‘ఓలమ్మ! ఓలమ్మ! తాతకేటైనాది?’ ఇంట్లోకి పరిగెత్తుకొచ్చి ముసలాయన నులక మంచం మీద కూర్చోవడం చూసింది.
‘మావో! ఏటైనాది నీకు?’ ముసలాయన తలెత్తి కోడలివైపు చూసాడు. కళ్ళంట నీళ్ళు బొట బొటా కారుతున్నాయి.
‘ఓరినాయనో! ఇప్పుడే టీ తాగినవు గందా! కడుపులో నొప్పా?’ మామని సుతారంగా అడిగింది.
నోటి మాట రాక టివి చూపించాడు. అటువైపు రత్తి చూసింది. టివిలో ఇంకా సైనిక దుస్తుల్లో ఉన్న కొందరినీ చూపిస్తూ ముష్కరుల దాడి గురించి వార్తలు చెబుతున్నారు. రత్తికి ఏమీ అర్ధం కాలేదు. కొంచెంసేపు అలానే చూస్తూ ఉంది. లచ్చిగాడికి అడిగింది.
‘లచ్చీ! ఏటైంది? నాకేటీ బోదడ్లేదు’
వాడు తెల్లమోహంతో తాతనడిగాడు.
‘ఏటైంది తాతా? అయ్యకేటైనయ్యిందా?’
–******–

కొమరయ్యకి భీముడొక్కడే కొడుకు. ఊరు ఎక్కడో కొండ మీదుంది. కొర్రలు, సామలు కొండమీద పోడు కాల్చుకొని ఒక పూట తింటే ఇంకో పూట పస్తుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాధమిక పాఠశాలలో చదివించాడు. తాను చిన్నప్పుడు దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు. కొడుకు ఎంతో కొంత ఉన్నతమైన చదువు చదివి ప్రయోజకుడైతే తనకి కాకపోయినా వాడి కుటుంబం బాగుపడుతుందని ఆశ. ఎలాగైనా కొడుకుని చదివించి ఆ ఊర్లో చదువుకున్న మొదటి వ్యక్తీ తన కొడుకు కావాలని ప్రయోజకుడై నలుగురికీ స్పూర్తిదాయకం కావాలని కొమరయ్య తాపత్రయం.

ఊర్లో అప్పటివరకు ఎవరూ బడి ముఖం ఎరుగరు. వానా కాలం అడవి మధ్యలో కొంత దూరం పొలం గట్లంబటి బడికి వెళ్ళాలంటే ఊహకందని కష్టం. ప్రభుత్వానికి ఊరు ఉన్నట్లే తెలియదనిపిస్తుంది. ఒక అధికారి కానీ, ఒక ప్రజా నాయకుడు కానీ ఎప్పుడూ వచ్చిన దాఖలాలు లేవు. ఆ ఊర్లో ఎప్పుడైనా ఓటు వేసి ఎరుగరు. ఎవరు ఓట్లు వేస్తున్నారో ఎవరు గెలుస్తున్నారో తెలియదు. అంతెందుకు, ఓట్లు ఎందుకు వేస్తారో చాలామందికి తెలియదు. ఎవరైనా చదువు గురించి మాట్లాడితే ‘డబ్బున్నోళ్ళకే ఆ సదువులు, మనకెందుకురా!’ అని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ. ఇటు ఉద్యోగాలు లేక అటు చేతి నిండా పనిలేక తొంబై శాతం వ్యసనాలకి బానిసలై అనారోగ్యం పాలైనవారు ఎక్కువ. పూర్వం నుండి ఉన్న ఆచార వ్యవహారాలు పాటించడం తప్ప ఆలోచనా విధానంలో ఎవరికీ మార్పు రాలేదు. సమసమాజంలో జరుగుతున్న మార్పులపై అవగాహన లేదు.

కొమరయ్య ప్రక్కనున్న ఊరు అప్పుడప్పుడూ పనికి వెళ్తూ అక్కడి పనివాళ్ళతో మాట్లాడుతూ కొంత సామాజిక స్పృహతో కొడుకుని చదివించాలన్న ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకరోజు ఆ ఊర్లో ఉన్న బడికి వెళ్లి పంతులుగారిని కలిసి తన కొడుకుని చదివించాలన్న సంకల్పాన్ని విన్నవించుకున్నాడు. పంతులుగారికి కొండమీద నివసిస్తున్న ఆదివాసీలంటే ఒకరకమైన చిన్నచూపు.

‘నీ కొడుక్కి చదివిస్తావా?’ అన్నాడు పంతులు గారు వెటకారంగా.
‘అవును అయ్యోరు. తప్పా బాబు?’ అని అడిగాడు కొమరయ్య చాలా అమాయకంగా.
‘తప్పు కాదు గానీ, నీవు చదవలేదు గదా! వాడిని ఎలా చదివిస్తావు’ అన్నాడు పంతులు తెలివైన ప్రశ్న వేసానని మనసులో సంతోషపడుతూ
‘పెద్దయ్యగారు సదవలేదు కదా! మరి తమరికబ్బింది గదయ్య గారు!’ అన్నాడు కొమరయ్య
పంతులుగారు కుడితిలో పడ్డ ఎలాకలాగా మనసు గిలాగిలా కొట్టుకొని ఏం చెప్పాలో తెలియలేదు. కొంచెం చిరాకుగా ముక్కుపైనున్న కళ్ళద్దాల పైనుండి ఒక చూపు చూసి
‘సరేలే కొడుక్కి చదివించి ఏం చేస్తావ్?’ అన్నాడు. మళ్ళీ కొమరయ్య ఏ అధికారికో ‘ఆదివాసీనని నా కొడుక్కి చదువు చెప్పలేదని’ ఫిర్యాదు చేస్తాడని భయం.
‘సిన్న ఉజ్జోగం సేసు కుంతే ఆడి ఆలి, పిల్లలూ బాగుపడ్రా బాబు!’ అన్నాడు కొమరయ్య.
‘సర్లే! రేపుదయం తీసుకురా’ అన్నాడు పంతులుగారు.
అలా మొదలైన భీముడి చదువు ప్రయాణం ఐదవ తరగతి వరకు సాఫీగానే సాగిపోయింది.
–******–

ఉన్నత బడికి పంపాలంటే రోజూ ఏడు మైళ్ళు నడవాలి. భీముడు దిట్టంగానే ఉంటాడు. కానీ 12 సంవత్సరాల వయస్సులో ఇంచుమించు 10 కిలోమీటర్లు నడవాలి. వాడితో అయ్యే పనేనా! ఖర్చు ఎంత అవుతుందో తెలియదు. కొమరయ్యకు ఏం చెయ్యాలో తోచడం లేదు.

పంతులుగారు మొదట్లో నిరుత్సాహపరచినా ‘భీముడు బాగా చదువుతాడు. వాడిని ఎలా అయినా చదివించు కొమరయ్యా’ అని చెప్పాడు. ఊళ్ళో ఎవరితో మాట్లానా ధైర్యం చెప్పేవాళ్ళే లేరు. ఇంటికొచ్చి దిగాలుగా కూర్చుంటే భార్య ముత్తి
‘నీకేటైపోనాది? కొడుకు సదువుకి బెంగేట్టుకున్నావా?’ అంది.
‘ఉదిమిలోని మాట ఉన్నట్టన్నావే’ అన్నాడు కొమరయ్య
‘ఓసోస్, దీనికే బెంగేలా? నా పుస్తిలతాడు ఉన్నాది గందా!’ ముత్తి ఏదైనా కొడుకు గురించే గదాని తీసిచ్చింది.
కొమరయ్య ఆశ్చర్యపోయాడు. పెళ్ళికిచ్చిన ఆ మూడు కాసుల బంగారం తప్ప తరువాత తాను ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. ముత్తి కూడా ఏమీ కావాలని అడగలేదు. తాను తీసుకోవాలా! వద్దా! అని ఆలోచనలో పడ్డాడు.
‘ఏదైనా ఆడికే గందా! మేడ్లోనేసుకొని అది నేనేటి సేత్తాను? ఆడు బాగా సదువుకుంటే ఎప్పుడో నాకు, నాతోని నీకు గాలోడేక్కించడా!’ తన మనసులోని మాట తనలోనే అనుకున్నా కొమరయ్యకి వినిపించింది.
‘గదా నీ అలోసన. మట్టి బుర్రే అనేసుకున్నాను. సర్లే’ అని మంగళ సూత్రం అందుకున్నాడు.

తెల్లారి భీముడ్ని తీసుకొని పంతులుగారిచ్చిన పత్రాలన్నీ పట్టుకొని పట్నం బయల్దేరాడు.
ఉన్నత పాఠశాలలో ఎవర్ని కలవాలో తెలియదు.
గేటు దగ్గర నిలబడుంటే బంట్రోతు వచ్చి ‘ఇక్కడేటి సేస్తాన్నారు? ఇది ఇస్కోలని తెల్దా?’ అని గట్టిగా గసిరాడు.
‘అది కాదు బాబు, మావోడు ఆరో తరగతికని…’ ఇంకా ఎదో చెప్పబోయాడు కొమరయ్య.
‘ఏటి, సదువుకే?’ అన్నాడు బంట్రోతు.
‘అవును బాబు’ అన్నాడు కొమరయ్య
‘ముందు ఐదో తరగతి వరకూ సదివితే అప్పుడు ఆరో తరగతి’ అన్నాడు బంట్రోతు, తనే ఆఫీసర్ లాగా
‘సదివాడు బాబు’ అన్నాడు కొమరయ్య
‘ఏటి, ఐదో తరగతే?’
‘అవును బాబు, ఇగో ఈ కాగితాలు సూడండి. పక్కూరు పంతులుగారిచ్చారు’
కాగితాలు కిందా మీద రెండు సార్లు తిరగేసి దానిమీద పక్కూరి బడి పేరు సరిగ్గా ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు చదివి
‘అబ్బా! ఐదో తరగతి సదివినావా నువ్వు!’ అని భీముడి వైపు చూసాడు. భీముడు తలూపేడు.
బంట్రోతు స్కూలు లోనికి తీసుకెళ్ళాడు.
‘ఇగో ఇక్కడ కూకోండి. నేనిప్పుడే పెద్ద పంతులుగారికి సేప్పేసి వత్తాను’ అన్నాడు బంట్రోతు.

పిల్లలు ఎంచక్కా యూనిఫారం వేసుకొని తిరుగుతుంటే కొమరయ్య భీముడ్ని ఆ బట్టల్లో చూసుకొని మురిసిపోయాడు. కొంతమంది పిల్లలు కొంచెం దూరంలో కబడీ ఆడుతున్నారు. మరికొందరు కో కో ఆడుతున్నారు. మరోప్రక్క రసాయనాలతో కూడిన ప్రయోగశాల. ఎప్పుడూ రాని ప్రదేశం. వింతగా వుంది. కొమరయ్య ఎప్పుడైనా ఈ బడిలోకి వచ్చిన పాపాన పోలేదు. చూస్తానన్న ఆలోచన కూడా రాలేదు. ఎక్కడికో చెన్నై, బంగళూరు వెళ్ళినంత సంబరంగా వుంది.

భీముడు పైకి ఏమీ అనడం లేదు కానీ లోపల చాలా సంతోషపడిపోతున్నాడు. కొత్త ప్రదేశం, కొత్త జట్టులు, కొత్త బట్టలోస్తాయని పొంగిపోతున్నాడు. కొత్త బట్టలు కట్టుకొని ఒక సంవత్సరం పైనే అయ్యింది. అయ్య పరిస్థితి చూసి తాను ఎప్పుడూ ఏదీ అడగడు. అయ్య దగ్గర డబ్బులుంటే తనే కొంటాడన్న నమ్మకం.

‘ఈ బంట్రోతు అటెళ్ళి గంటైంది, ఇంకా రాడేమిటని’ ఇద్దరూ ఒకేసారి అనుకున్నారు. అనుకున్నంతలో రానే వచ్చాడు.

‘ఇగో పెద్ద పంతులుగారు ఇప్పుడే పాఠం సెప్పోచ్చినారు. ఇద్దరూ రండి’ అన్నాడు బంట్రోతు తాను తప్పించి ఈ ప్రపంచంలో కొమరయ్యకు దిక్కు లేదన్నట్లు.

పెద్ద పంతులుగారు కాగితాలన్నీ చూసి గుమస్తాని రమ్మని
‘ఈ అబ్బాయిని ఆరో తరగతిలో చేర్పించు. వీరి దగ్గర డబ్బేమీ తీసుకోనక్కరలేదు’ అన్నాడు.

కొమరయ్యకి కొంత వినబడి వినబడనట్లు అనిపించింది.

గుమాస్తా అన్ని పన్లు పూర్తిచేసి రేపటినుండి బడికి భీముడు రావచ్చు అన్నాడు.
‘ఏదైనా డబ్బు కట్టాలా బాబు’ అన్నాడు కొమరయ్య అమాయకంగా.
‘ఏమీ అవసరం లేదు’ అన్నాడు గుమాస్తా.
కొమరయ్య చాలా సంతోషపడిపోయాడు.

బయటికి వచ్చిన తరువాత బంట్రోతు కోమరయ్యతో
‘సూసినావా! ఎంత బెమ్మాండంగా పని సేయ్యించేసాను’ అన్నాడు.
‘మీ ఋణం తీర్సుకోలేను బాబూ. మరెల్లోత్తాము, మావాడ్ని జాగర్తగ సూసుకోవలె’ అన్నాడు కొమరయ్య.
‘మరేదైనా ఇచ్చుకో. ఒట్టిగ ఎలాగైపోద్ది’ అని బంట్రోతు నీళ్ళు నమిలాడు.
కొమరయ్య అయిదు పైసలు చేతిలో పెట్టాడు. బంట్రోతు ఎగాదిగా చూసాడు ఇంతేనా అన్నట్టు.
కొమరయ్య తన భార్య పుస్తిలు తీసి చూపిస్తూ ‘నా దగ్గర అంతకన్నా ఏమీ లేదు’ అన్నాడు.
బంట్రోతు అవాక్కై ఆ అయిదు పైసలు కూడా ఇచ్చేసి ‘భీముడూ! ఆ మూల కొట్లో కోరుండ కొనుక్కొని తినుకుంటూ మీ ఊరెళ్ళు’ అని ఇద్దరినీ గేటు బయటకు సాగనంపాడు. అలా హై స్కూల్ శుభారంభం.

కొడుకు నిన్న లేదు మొన్న ప్రాధమిక పాఠశాల పూర్తీ చేసాడు. ఇప్పుడు ఉన్నత పాఠశాలలో చేరాడు. అప్పుడే దేశాన్ని రక్షించే ఒక సైనుకుడైపోయినట్లు త్రోవంతా మననం చేసుకుంటున్నాడు. ఊరిలో అందరికీ ఎంత తొందరగా వెళ్లి చెప్పాలా అని పరుగూ నడకతో ప్రక్కనే భీముడున్నాడని కూడా తెలియకుండా అడుగులు వేస్తున్నాడు.

త్రోవలో ఊరి పోస్ట్ మాన్ కనబడితే ‘భీముడు పట్నంలో ఆరో తరగతిలో చేరాడు’ అని చెప్పి మురిసిపోయాడు. ఊరి పొలిమేరల్లో కనిపించినవారందరికీ సంగతి చెప్పి పొంగిపోయాడు. తన కొడుకే ఊర్లో ఉన్నవారందరిలోకి మొట్టమొదట పట్నంలో చదువుతున్నాడని చెప్పకపోయినా మాటల్లో ఆ గర్వం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇంట్లో ముత్తిని చూసి ‘నీ పుస్తిలుసేరు అమ్మేసినానే’ అని పరాచికాలాడాడు.
ఆ నవ్వులో ఉన్న ఆనందం గమనించి ముత్తి కావాలనే ‘మిగిలిన పైసాలు నాకిచ్చేయి, నా సునపకాయలో దాసికుంతాను’ అంది.
కొమరయ్య ఖంగు తిన్నాడు.
‘నీతో ఇగటాలాడాలనిపించి అలగన్నానే, అక్కడేటీ తీసుకోలేదు’ అన్నాడు కొమరయ్య.
‘నాకు తెలీదేటి నీ ఎగసెక్కాలు. నాను కూడా ఇగటమాడేను’ అంది.
–******–

పదవ తరగతి ముగుస్తుందనగా పక్కూరు మునసబు గారిని కలిసాడు కొమరయ్య.
‘ఏం కొమరయ్యా! ఏదో పనిమీదొచ్చినట్లున్నావు!’ అన్నాడు మునసబు.
‘దండాలు బాబుగోరు! ఊరిలో పనుండి ఒకపాలి సూసేల్దామని వచ్చాను అయ్యగారు’ చాలా వినయంగా అన్నాడు కొమరయ్య
‘ఏదైనా ఉంటే చెప్పు. మీవాడు ఎలా చదువుతున్నాడు?’ అడిగాడు మునసబు
‘ఆడిగురిండే పరిసాన్లోనున్నాను. మీకొకపాలి సెవిలో…’ నసిగాడు కొమరయ్య
‘సల్లకొచ్చి ముంత దాయడమెందుకు? సంగతేంటో చెప్పు’ అన్నాడు మునసబు.
‘మరీ! బాబు గారు మీరేమనుకోనంటే…’ మరికొంత నసిగాడు కొమరయ్య
‘చెప్పు ఫరవాలేదు కొమరయ్య. మీ వంశమంతా మాకు సేవ చేస్తున్నారు గదా! నా దగ్గిర దాపరికాలెందుకు?’ మునసబు అభయహస్తమిస్తూనే అడిగాడు.
‘ఎదో మా భీముడికి పదో తరగతి వరకూ సదివించాను బాబు. ఇక నా వల్ల కాదు. ఆడికి సిన్న ఉజ్జోగం అయిపోతే పెళ్లి సేసేద్దమనుకుంతున్నాను బాబు’ మనసులో మాట సేప్పాడు కొమరయ్య
‘ఓరి నీ దుంప తెగ! ఎమ్మేలు సదివినోళ్లకే దిక్కు లేదు. ఈడింకా పదే గదా! అయినా ఇప్పుడే పెళ్ళేంటి?’ మునసబుగారు చాలా వెటకారంగా అన్నారు.
‘అలా అనకండి బాబు. ఏదో మీ దయవల్ల ఏ మిలిటరీలోనో తోసేస్తో ఆడి బతుకు ఆడు బతుకుతాడు’ చాలా ఆవేదనతో అన్నాడు కొమరయ్య
మునసబుగారికి ఏదో గుర్తుకొచ్చింది.
‘అబ్బా! సరిగ్గా గుర్తు చేసావు కొమరయ్యా! మొన్నే పట్నమెలితే ఎవరో అడిగారు. మనవాళ్ళు పదోతరగతి చదివినవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. రేపు నేను మళ్ళీ పట్నం వెళ్ళినపుడు వివరాలు కనుక్కొస్తాను. నీవు రెండు రోజుల్లో మళ్ళీ కనిపించు” అన్నాడు మునసబు.
‘అలగే బాబుగారు. మీ ఋణముంచుకోను’ అన్నాడు కొమరయ్య

కొమరయ్య ఇంటికి వెళ్తూ దేవుడు ఎప్పుడూ నన్ను చల్లగా చూస్తుంటాడు అనుకున్నాడు. భీముడికి మిలిటరీలో ఉద్యోగం వస్తే గ్రామదేవతకి మొక్కు చెల్లిస్తానని మనసులో అనుకున్నాడు.
–******–

కొమరయ్య వెళ్ళకముందే మునసబు దగ్గరనుండి కబురొచ్చింది. ఆగమేగాలమీద కొమరయ్య మునసబుగారింటి దగ్గర వాలాడు.
‘నీ కొడుకు అదృష్టం బాగుంది కొమరయ్యా! పట్నంలో నా స్నేహితుడొకడు మిలిటరీలోనే పనిచేస్తాడు. వాడి దగ్గరికి మీవాడిని రేపు తీసుకొని వెళ్ళు. వాడు అంతా చూసుకుంటాడులే’ అని ఎక్కడుంటాడో వివరాలు చెప్పాడు.
‘నీ కాలు మొక్కుతాను బాబు. మీ ఋణం ఉంచుకోను బాబు గారు’ అని వెళ్ళిపోయాడు కొమరయ్య

భీముడు బలిష్టంగా ఉండి మంచి ఎత్తుగా ఉండడం వల్ల పదో తరగతి పరీక్షా ఫలితాలు తెలిసిన వెంటనే సిపాయిగా ఎంపిక కావడం శిక్షణకు వెళ్ళడం అంతా ఒక కలలా అయిపోయింది. కొమరయ్య, ముత్తి ఆనందానికి అవధులు లేవు. కొమరయ్య అనుకున్నట్లుగానే భీముడికి ఉద్యోగం రావడం, వాడు దేశ పరిరక్షణలో భాగంగా ఎదిగి ఈ కుటుంబానికి, ఊరికి మరియు ప్రాంతానికి పేరు తెచ్చినవాడు కావడం ఒకింత గర్వంగా ఉన్నా మన మూలాలు మరువకూదదన్న ఇంగిత జ్ఞానంతో నిబద్ధతగా అందరితో మెలుగుతున్నారు.
–******–

ఈ ఊరికి కరెంటు లేదు, ఒక బడి లేదు, దగ్గరగా ఉన్న పట్నం పోదామంటే ఒక మంచి రహదారి లేదు. ఫోను చేద్దామంటే కుదరదు. ఒకరోజు రాత్రి భోజనం చేసిన తరువాత పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ ముత్తితో అన్నాడు.
‘అసే, భీముడు మనూరికి అన్నీ చేయిస్తాడంతావా?’
‘అదేటలగంతవో! ఇప్పుడే గందా ఆడు ఉజ్జోగానికెళ్ళినాడు. ఈ పాలొచ్చినప్పుడు నువ్వే అడుగు’ చేస్తాడన్న నమ్మకమున్నా ఇంకా చిన్నోడు గదా అన్న భావం స్పురించింది ముత్తి మాటల్లో.
‘ఆడికింకా పెళ్లి సేయ్యల్ల. పిల్లలు పుట్టాల, ఇంకా బోల్డంత యవ్వారముంది. ఈ సారొచ్చినప్పుడు ఆడి పెళ్లి సంగతడగాల’ ముత్తి సౌమ్యంగా చెప్పినా మాటలు ధృడంగా ఉన్నాయి.
‘ఎప్పుడొస్తాడో ఏమో! ఆడికి సెలవలియ్యాల, రాను పోను వారమన్నాడు ఎల్నప్పుడు’ కొమరయ్య కొడుకుని తలచుకుంటూ ఎలా ఉన్నాడోనని ముత్తికి కనిపించకుండా చెక్కేలిపై నుండి ఒక కన్నీటి చుక్క జార్చాడు. ముత్తికి ఆ చుక్క చీకటిలో కనబడలేదు కానీ గొంతులోని ఆర్ద్రతతో అనుభూతిని స్ప్రుసించగలిగింది .

భీముడు వెళ్ళినాక కొత్తలో వారం పదిరోజులకొక ఉత్తరం వ్రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరం రావాలంటే ఒక పక్షం. ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ లేదు గదా. పక్కూరికొస్తే ఆ పోస్ట్ మాన్ వారం కొకసారి ఈ ఊరి ఉత్తరాలు పట్టుకొస్తాడు. పోస్ట్ మానె ఉత్తరం చదివి పెడతాడు. ఏడాదిన్నర అయిన తరువాత భీముడు వస్తున్నట్లు ఉత్తరం వ్రాసాడు. కొమరయ్య భీముడు వచ్చినప్పటికీ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి ఏర్పాట్లు చేయాలని అనుకున్నాడు.
‘తోలేత వత్తన్నాడు గందా! నాకోసం ఏం తెత్తాడో’ అని ముత్తి ఒకటే ఆలోచన
–******–

ఆ రోజు రానే వచ్చింది. భీముడు మిలిటరీ బట్టలు, బూట్లు వేసుకొని నేరుగా పెట్టె పట్టుకొని ఊరి పోలిమేరకి వచ్చినప్పటికీ ఊళ్ళో పిల్లలందరూ గుమిగూడి చల్లని కబురు కొమరయ్యకి అందించారు. ఉన్న పళంగా కొమరయ్య, ముత్తి పరిగెత్తుకుంటూ కళ్ళ నీళ్ళ పర్యంతం భీముడికి ఎదురెళ్ళారు. పైకి గంభీరంగా కనపడినా అమ్మ మనసు వెన్నపూస. షుమారు 18 నెలల తరువాత మళ్ళీ ఒక దేశ సైనికుడుగా వచ్చిన కొడుకుని చూసి ఒకింత గర్వం. ఒకింత సంరంభం. ఇద్దరూ భీముడిని పట్టుకొని ఆనంద భాష్పాలు రాల్చారు. తరువాత చెరో చేయి పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళారు.

కుశల ప్రశ్నల తరువాత అమ్మ చేతి వంట తిని ఎన్నాళ్లైందో అనుకుంటూ సుష్ఠుగా భోజనం చేసాడు భీముడు. అమ్మ మాత్రం కొడుకు ప్రతీ కదలిక గమనిస్తూ ఉంది. వాడిలోని మార్పులు శరీర సౌష్ఠవం అన్నీ క్రీగంట చూస్తూనే వుంది. ఉద్యోగంలో ఉన్నపుడు, భోజనాలు, పడుకోవడానికి సదుపాయాలు, వాతావరణం అన్ని అడిగి తెలుసుకున్నారు. ముత్తి ఉండబట్టలేక
‘ఆడ కొర్రజావ ఇచ్చినారా?’ అమాయకంగా అడిగింది.
‘వారంకి మూడు రోజులు మాంసము, గుడ్లు, రొట్టిలు’ ఇస్తారమ్మా అన్నాడు. కొర్రజావ గురించి చెప్పలేదు.

రెండు రోజులు తరువాత మెల్లగా కొమరయ్య పెళ్లి సంగతి ఎత్తాడు.
‘మల్ల ఎప్పుడోస్తావో! అచ్చినప్పుడే రెండచ్చింతలు పడితే బాగున్ను గల్ల!’ రాత్రి భోజనం తరువాత కొమరయ్య భీముడు కంటిలోకి చూడకుండా తనలో తనే మాట్లాడుతున్నట్లు అన్నాడు.
భీముడు తనగురించే అనుకున్నాడు.
‘పిల్లని సూడాలగదా!’ అన్నాడు మెల్లగా.
‘నువ్వు ఊ! అంటే రేపే లగ్గమెట్టించేత్తాను’ అంది ముత్తి. ఎప్పుడడుగుతాడా అని ఎదురుచూస్తున్నట్టుగా…
‘మీ యిష్టం’ అన్నాడు భీముడు.
వచ్చినప్పటి నుండి ఊరిలోని స్నేహితులు ఒకటే గొడవ పప్పన్నం ఎప్పుడు తినిపిస్తావని! పెళ్లి చేసుకుంటే తన మాట ఎలా ఉన్నా అందరి సరదా తీరిపోతుందని భీముడు ఆశ పడ్డాడు.
ఊర్లోనే సంబంధం కుదిరి రెండువారాల్లో రత్తితో పెళ్లి. మూడో వారం ఇద్దరూ బయల్దేరి వెళ్ళిపోయారు.
ఉన్నంతలో సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించి ఊళ్లోనే కాకుండా పక్కూరి వాళ్ళను ముఖ్యంగా మునసబుగారిని ఆహ్వానించి అక్షింతలు తంతు ముగించారు.

మళ్ళీ అయిదేళ్ళకు లచ్చిగాడితో తిరిగొచ్చారు. భీముడు బాగా అలోచించి తన పేరు మహా భారతంలో ఒక మంచి పాత్ర గాబట్టి కొడుకు పేరు రామాయణంలో ఒక పాత్రయితే బాగుంటుందని కొడుక్కి ‘లక్ష్మణుడు’ అని పేరు పెట్టాడు. అది కాస్తా ఊరొచ్చిన తరువాత లచ్చిగాడు అయిపొయింది.

ఈసారొచ్చినపుడు మళ్ళీ పోస్టింగ్ కాశ్మీర్ లో ఉంటుందని రత్తిని, లచ్చిగాడిని ఇక్కడే వదిలేసి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు భీముడు.

ఈ అయిదేళ్ళలో ఊరి పరిస్థితి చాలా మారింది. కొమరయ్య పట్టుదలతో ఊరికి కరెంటు వేయించడం, ఒక బడి కట్టించడం చేయించగలిగాడు. పట్నం వెళ్ళడానికి తారు రోడ్డు కాకపోయినా ఎడ్లబండి త్రోవ చేయించాడు. ఊళ్ళో ఉన్నవాళ్లకే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి కొమరయ్యంటే ఒక గౌరవం, అభిమానం ఏర్పడింది.
–******–

కొమరయ్య టివిలో వార్తను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాడు. నిజంగా భీముడు ఇక లేనట్లేనా? వాడికోసం ఎంత కష్టపడ్డాను? ఈ ఊరు ఊరంతా, కాదు ఈ సుట్టుపక్కల ఊళ్ళన్నీ వాడంటే అభిమానము, గౌరవము. కొండమీద పుట్టిపెరిగినా కష్టపడి సదివి పేరు తెచ్చాడు.

రత్తికి ఏం చెయ్యాలో తెలియక పక్కింట్లో ఉన్న వాళ్ళను, ఎదురింట్లో వాళ్ళను పిలుచుకొచ్చింది.
అందరూ ఏం జరిగిందో తెలీదు గానీ భోరుమని ఏడవడం మొదలుపెట్టారు.
ఒక పెద్దాయన మెల్లగా కొమరయ్య దగ్గర కూర్చొని అడిగాడు
‘కొమరోడా! ఎతయ్యిందేటి? అందరూ ఏడుపులు, మొఱలు….
‘కొమరోడు ఏదో ఇప్పుడు సెప్తాడు. అందరూ నోళు ముయ్యండి’ అన్నాడు.
అంతా నిశ్శబ్దం. ఆత్రంగా కొమరయ్యవైపు చూస్తున్నారు.
‘భీముడు సచ్చిపోయినాడు!’ ఏడుస్తూ నోటికి తువ్వాలు అడ్డం పెట్టుకొని చెప్పాడు కొమరయ్య
మళ్ళీ అందరూ ఏడుపు మొదలుపెట్టారు
పెద్దాయన ‘నీకెవురు సెప్పినారు?’ అనడిగాడు
‘టివి లో ఇప్పుడే సూపించారు’ అన్నాడు కొమరయ్య
‘భీముడుని సూపించారా?’ పెద్దాయన మళ్ళీ అడిగాడు
‘అవును. భీముడులాగున్నాడు ఒక సిపాయి’ అన్నాడు కొమరయ్య
రత్తి, లచ్చుగాడు ఒకటే ఏడుపు. వారిని ఆపడం ఎవరితరమూ కావడం లేదు.
ఇంతలో ముత్తి బయటినుండి వచ్చి విషయం తెలుసుకొని
‘నా భీముడుకి అందరి దిష్టి తగిలి ఆడు పైకెల్లిపోనాడు’ అని కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలెట్టింది
పెద్దాయనకెందుకో భీముడికి ఫోను ఉంది కదా పట్నమెల్లి ఎవరైనా ఫోన్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది.
నంబరు రాసిచ్చి ఒకబ్బాయితో పంపించారు.
కొమరయ్య మంచం పైనుండి సాయంత్రం వరకూ దిగలేదు. పట్నం వెళ్ళిన అబ్బాయి సాయంత్రం తిరిగొచ్చాడు. ఫోను కలవలేదని చెప్పాడు. రెండోరోజు కూడా మళ్ళీ ఫోను ప్రయత్నించారు. మూడో రోజు అదే పరిస్థితి.
ఇంక కొమరయ్యకి నూటికి నూరు శాతం తాను అనుకున్నదే జరిగిందని అనుకున్నాడు. ఊరు ఊరంతా ఒకటే గోల.
–******–

మూడు రోజుల తరువాత ఒక నిర్దారణకొచ్చి జరగవలసిన తంతు జరిపించాలి గదా అని గ్రామ పురోహితుడిని పిలిచి ఏర్పాట్లు ప్రారంభించారు. ముందుగా గ్రామ దేవతను దర్శించుకొని మిగిలిన కార్యక్రమాలు మొదలుపెడితే బాగుంటుందని పెద్దాయన చెబితే అలాగే అని అందరూ బయల్దేరారు.
గత నాలుగు రోజులుగా తిండి సరిగ్గా తినక కొమరయ్యకి నడిచే శక్తి లేదు. కానీ వెళ్ళాలని ఉంది. మనవడు లచ్చిగాడిని ఒకవైపు పక్కింటి అబ్బాయి మరోవైపు తోడ్కొని మెల్లగా ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత గుడికి వెళ్లారు. ఊర్లో ఉన్న చిన్నా, పెద్ద అందరూ కలిసి వారి వెంటే వెళ్లారు.
గ్రామదేవత గుడిలో పూజలు చేస్తున్నంతసేపు కొమరయ్య ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయినా ఎవరికీ చెప్పలేదు. మనవడు, కోడలు భవిష్యత్తు ఏమౌతుందోనని ఒకటే ఆలోచన. ఒకటే భయం. ఒక్కగానొక్క కొడుకు యుక్త వయస్సులోనే పెళ్లి జరగడం లచ్చిగాడు పుట్టడం – పాతికేళ్ళ వయసుకే జరిగిపోయాయి. పెళ్ళికాకుండా ఉంటే ఈ జంజాటం లేకుండా ఉన్నేమో! పూజ జరుగుతున్నంతసేపు ఇవే ఆలోచనలు. పూజ పూర్తై కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒకబ్బాయి గట్టిగా
‘భీముడొచ్చాడో’ అని అరిచాడు.
అందరూ స్థావుణువులా అటువైపు చూస్తున్నారు ‘నిజమా!’ అన్నట్లు.
రెండు నిముషాలు తరువాత నిజంగానే భీముడు వచ్చాడు మిలిటరీ బట్టలు వేసుకొని సూట్ కేసు పట్టుకొని.
అందరికీ ఆశ్చర్యం. నిజంగా భీముడొచ్చాడా అని ఒళ్ళు గిల్లుకున్నారు.
కొమరయ్య ఇంకా నమ్మలేకపోతున్నాడు. నోట మాట రావడం లేదు. కన్నీరాగడం లేదు. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. భీముడ్ని దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగిలించుకున్నాడు.

‘ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం. పుట్టిన దగ్గరనుండి ఎంత అల్లారుముద్దుగా పెంచాడు! భీముడు ఒక ఉద్యోగస్తుడై ఊరికి, ఈ ప్రాంతానికి పేరు తేవాలని కలలు గన్నాడు. పక్కూరి బడిలో చేర్పించడానికి చిటికెన వేలు పట్టుకొని అడివిలోను మాట మంతి చెప్పి త్రోవలో వాకాయ పళ్ళు, ఉసిరికాయలు తినిపించి బడి పంతులు చిన్నబుచ్చే మాటలు అన్నా ఎంతో అణకువుగా ఉండి చదీవించాడు. వర్షాకాలం జలుబు చేసి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయి అవస్థపడితే రెండు రోజులు చదువు మానకూడదని భుజంపై ఎక్కించుకొని బడికి తీసుకెళ్ళాడు. ఈ ఊరికి భీముడు హయాములో ఎన్నెన్నో మంచి పనులు జరగాలని తపన పడ్డాడు. తన జీవితమంతా భీముడు ఈ ఊరీలో అందరికీ స్పూర్తిదాయకం కావాలన్న లక్ష్యంతో కృషి చేసాడు. తనే సర్వస్వం, భీముడే తన తనలోకం అని ప్రతిన బూనాడు’.

భీముడుకి అక్కడ ఈ పూజ ఎందుకు జరుగుతుందో మెల్లమెల్లగా అర్ధం అయింది. ‘నా కోసం మా అయ్య, అమ్మతో పాటు ఊరు ఊరంతా ఏకమై గగ్గోలు పెట్టారన్నది’ తెలుసుకున్నాడు. వారందరి ఆప్యాయత, అభిమానానికి భీముడు కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంత అభిమానం చూపిస్తున్న వారందరికీ ఏదో తనవంతుగా సహాయం చేయాలి అనుకున్నాడు మనస్సులో. భార్య, కొడుకుని దగ్గరకి తీసుకొని తల నిమిరాడు. ‘ఇంత ప్రేమ చూపిస్తున్న వారిని విడిచి ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో పనిచేయడం అవసరమా?’ అనుకున్నాడు. దుఃఖము, ఆవేశము కలబోసిన ఆనందంలో తనని తాను మరచిపోయే తన్మయత్వంలో ఉన్నాడు భీముడు.

కొమరయ్య ఇంకా భీముడిని పట్టు విడువలేదు. అది మరింత బిగుసుకుంటున్నట్లుంది. ఆ కౌగిలింతలోనే మనవడి చేతిని భీముడు చేతిలో పెట్టి అప్పగించాడు. నా మీద నమ్మకంతో నీ కొడుకుని నాకప్పగించావు. నీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాడికి నాకు తెలిసినంతలో ఆత్మాభిమానము, గౌరవ మర్యాదలు నేర్పించి నీకు తిరిగి అప్పగిస్తున్నానన్న భావన వుంది. వాడితో పాటు మన మనసులతో పెనవేసుకున్న ఈ ఊరు బంధాన్ని కూడా నీ చేతిలో పెడుతున్నానన్న ఒక సందేశం ఉంది. భీముడిని తన గుండెకు మరింత గట్టిగా హత్తుకున్నాడు. భీముడు తండ్రి ఆప్యాయతను తనివితీరా అస్వాదిస్తున్నాడు. అందరూ ఎంతో ఆనందంతో కేరింతలు కొట్టారు. గ్రామదేవత చల్లగా చూసిందని దండాలెట్టారు.

కొమరయ్య మాత్రం భీముడ్ని వదలలేదు. అలాగే క్రిందకి జారిపోయాడు. తుది శ్వాస విడిచిపెట్టాడు.

మల్లికేశ్వర రావు కొంచాడ
మెల్బోర్న్, ఆస్ట్రేలియా